ఆ ఊళ్లో కరోనా కట్టడికి కమాండోలు రంగంలోకి దిగారు.. అక్కడేం జరిగింది?

By సుభాష్  Published on  9 July 2020 5:31 AM GMT
ఆ ఊళ్లో కరోనా కట్టడికి కమాండోలు రంగంలోకి దిగారు.. అక్కడేం జరిగింది?

రోజుకు తొమ్మిది వందల పాజిటివ్ కేసులు వచ్చే హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా పదిహేను వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారిక సమాచారం వెలువడినంతనే మహానగర ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకున్నా.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల వాణిజ్యం సంస్థలు మొదలు పలు కాలనీ సంఘాలు అప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకోవటం షురూ చేశాయి. ఈ సీన్ ను ఇక్కడ కట్ చేసి.. పుంథూరా వద్దకు వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి? ఆ అవసరం ఏమిటో అక్కడ చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకీ పుంథూరా ఎక్కడుందన్న డౌట్ వచ్చిందా? వెయిట్.. మీ సందేహాల్ని తీర్చేస్తాం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కాస్త దూరంలో ఉండే ఊరు పుంథూరా. గడిచిన ఐదు రోజుల్లో ఆ ప్రాంతంలోని ఆరు వందల మందికి పరీక్షలు నిర్వహిస్తే.. ఏకంగా 119 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే.. ప్రతి ఆరుగురిలో ఒకరికి పాజిటివ్ గా తేలింది. ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలిన ఒక వ్యక్తి ఏకంగా 120 మందిని కలవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలోనే అయినా.. మహమ్మారిని కట్టడి చేసే విషయంలో కేరళ సర్కారు ట్రాక్ రికార్డు అదరగొట్టేస్తుందనే చెప్పాలి. మిగిలిన రాష్ట్రాల్లో వేలాది కేసులు నమోదవుతున్న వేళ.. కేరళ మాత్రం ఇప్పటికి 6,195 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిల్లో 3,559 మంది కోలుకున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో అతి తక్కువ మరణాలు (27 మంది మాత్రమే) చోటు చేసుకున్నాయి. ఆ బుల్లి రాష్ట్రంలో 2605 యాక్టివ్ కేసులు ఉంటే.. బుధవారం ఒక్కరోజులో 301 కొత్తకేసులు రావటం.. అందునా పుంథూరులో పెద్ద ఎత్తున కేసులు బయటపడటంతో కేరళ సర్కారు కీలక నిర్ణయాల్ని తీసుకుంది.

కేరళ రాష్ట్రంలో మరే ప్రాంతంలో లేని విధంగా పుంథూరాలో పెద్ద ఎత్తున కేసులు బయటకు వస్తున్న వేళ.. ఆ ఊళ్లోకి కమాండోలను రంగంలోకి దింపారు. ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. తిరువనంతపురం టు తమిళనాడులోని కన్యాకుమారి బస్సుల్ని కూడా నిలిపివేశారు. అంతే కాదు.. పుంథూరాలోని మతగురువుల్ని కలుస్తున్న కమాండోలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకరోజులో వందకు పైగా కేసులు ఒక ఊళ్లో వస్తే ఇంత హడావుడి చేస్తున్న కేరళ సర్కారును చూస్తే.. హైదరాబాద్ లో మరెన్ని చర్యలు చేపట్టాలంటారు?

Next Story