హైదరాబాద్‌లో సమస్యలు ఉన్నాయి.. మేము దాచడం లేదు : మంత్రి కేటీఆర్
Minister KTR Comments On Hyderabad Development. హైదరాబాద్ నగరంలో సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని మేము దాచడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 9 May 2023 3:07 PM ISTMinister KTR
హైదరాబాద్ నగరంలో సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని మేము దాచడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని, మనిషి ఉన్నంత కాలం సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ భూతల స్వర్గంగా మారిందని తాను చెప్పట్లేదని అయితే, నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయన్నారు. సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తున్నామనేది ముఖ్యమన్నారు.
హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి రూ.985 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను కొందరు గుర్తుంచుకోవాలని.. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్నారు. హైదరాబాదు నగరం విశ్వ నగరంగా ఎదగాలి అంటే ఫ్లై ఓవర్లు మెట్రోలాంటి సౌకర్యాలు.. మంచినీటి సౌకర్యం ఉండాలన్నారు. గడిచిన 9 ఏళ్లలో హైదరాబాద్ నగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడిందన్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా..? అని ప్రశ్నించారు. తమను గెలిపించిన ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.
బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఎంతోమంది ఈ నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేసినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంకన్నా అద్భుతంగా ఈ వైకుంఠధామాన్ని నిర్మించామని చెప్పారు.