హైదరాబాద్‌ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ కృషి చిరస్మరణీయం: కేటీఆర్

హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు

By -  Knakam Karthik
Published on : 28 Dec 2025 2:18 PM IST

Hyderabad News, Ktr, PJR, Death Anniversary, Brs, Congress

హైదరాబాద్‌ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ కృషి చిరస్మరణీయం: కేటీఆర్

హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే, ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజేఆర్ అని గుర్తుచేశారు.

ముఖ్యంగా "కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుత అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను చూసి ఉంటే, పీజేఆర్ గుండె ఆనందంతో పులకించిపోయేదని కేటీఆర్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిపై పీజేఆర్ గారికి ఉన్న విజన్ ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా, ప్రజా సేవలో పీజేఆర్ చూపిన నిబద్ధతను మరియు శ్రద్ధను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సేవలోనే కన్నుమూసే అరుదైన భాగ్యం పీజేఆర్‌కి దక్కిందని ఆయన అన్నారు.

పీజేఆర్ ఆశయాలను ఆయన సుపుత్రుడు, మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని పీజేఆర్ ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడంతో పాటు, మరోవైపు హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో విష్ణు తనదైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఏ తండ్రికైనా తన సంతానం ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్ వారి ఆశయాలను కొనసాగించడమేనని, ఆ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి సఫలమయ్యారని కేటీఆర్ అభినందించారు.

Next Story