ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అయ్యప్ప కాలనీలోకి ఇకపై వరద నీరు రాదని చెప్పుకొచ్చారు. నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్‌బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్‌బీ నగర్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో రూ.220 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు జరిపిస్తామని.. రూ.985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలను త్వరలో కట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. రూ.84 లక్షలతో జంతువుల కోసం స్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు.