జూబ్లీహిల్స్ బైపోల్ కోసం రంగంలోకి కేసీఆర్..కేటీఆర్, హరీశ్‌రావుతో చర్చలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు.

By -  Knakam Karthik
Published on : 22 Oct 2025 1:45 PM IST

Hyderabad News, Jubilee Hills bypoll, KCR, Ktr, Harishrao

జూబ్లీహిల్స్ బైపోల్ కోసం రంగంలోకి కేసీఆర్..కేటీఆర్, హరీశ్‌రావుతో చర్చలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రేపు తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఉపఎన్నిక ప్రచార సరళిపై చర్చించి, నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌లో రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై ఇద్దరితో చర్చించినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించింది. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల బృందం కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటోంది. అయితే, కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు, ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీజేపీలు కూడా సవాలుగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచి తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండటంతో జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

Next Story