రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
భారీ వర్షాలు ఒక వైపు.. కబ్జాల తొలగింపు మరో వైపు.. ఇలా మల్టీ టాస్కుతో హైడ్రా పని చేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
By - Medi Samrat |
భారీ వర్షాలు ఒక వైపు.. కబ్జాల తొలగింపు మరో వైపు.. ఇలా మల్టీ టాస్కుతో హైడ్రా పని చేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ. 50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. ఇలా చెరువులు, కాలువల్లో ఆక్రమణలను తొలగించి.. ప్రకృతిని పరిరక్షించడం ద్వరా నగరానికి మంచి భవిష్యత్తును ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. హైడ్రా కార్యకలాపాలను వివరించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు హైడ్రా చర్యలన్నీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజలందరికి మంచి అభిప్రాయం ఉందని.. ఒకరిద్దరు విమర్శించినా భవిష్యత్తులో వాళ్లు కూడా మెచ్చుకుంటారని అన్నారు. తన సర్వీసులో విమర్శలు కొత్త కాదని.. తర్వాత రియలైజ్ అయిన ఘటనలున్నాయన్నారు. ఉదాహరణ 2007వ సంవత్సరం విజయవాడలో జరిగిన అయేషామీరా హత్య కేసులో నిందితుడిగా సత్యంబాబును గుర్తించడంతో పాటు.. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన దర్యాప్తులే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పుడు హైడ్రా చర్యలు కాస్త కఠినంగా అనిపించినా.. నగర భవిష్యత్తు బాగుండాలంటే తప్పవని పేర్కొన్నారు. గొలుసుకట్టు చెరువులను, కాలువలను, ప్రభుత్వ భూములను కాపాడుకోలేకపోతే.. పర్యావరణం దెబ్బతింటుందని హెచ్చరించారు.
923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం..
ఔటర్ రింగు రోడ్డు పరిధిలో 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రాకమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. దీని విలువ రూ. 50 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ నెల 21న గాజుల రామారం, ప్రగతినగర్ మధ్యన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఈ భూమి కబ్జాలకు గురౌతుంటే.. స్థానికుల ఫిర్యాదుమేరకు విచారణ జరిపి.. ఆదివారం నాడు కబ్జాలనుతొలగించాం. ప్రగతినగర్‌వైపు బడాబాబులు కబ్జాలుంటే.. పదుల ఎకరాల్లో వెంచర్లను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాం. ఇలా ఇప్పటి వరకూ 581 ఆక్రమణలను తొలగించాం. ఇందులో బడాబాబుల కబ్జాలే ఎక్కువగా ఉన్నాయి. గండిపేటలో ప్రముఖ రాజకీయనాయకుల రిసార్టులు, ప్లే ఏరియాలు తొలగించాం. మూసీ నది ప్రవాహంపై ప్రభావం పడే విధంగా ఉన్న ఆక్రమణలు భారీ మొంత్తంలో తొలగించాం. ఇందులో ప్రభుత్వ భూములు 424 ఎకరాలు కాగా.. నాలాలు, రహదారులు, పార్కులు, చెరువులు, అనుమతులు లేని నిర్మాణాలు వెలిసిన చోట తొలగించిన ఆక్రమణలు కలిపితే మొత్తం 923.14 ఎకరాల భూమిని కాపాడామని చెప్పారు.
వర్షాల వేళ డీఆర్ ఎఫ్ సేవలు..
గతంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదౌతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీఢనం వంటి సందర్భాల్లో వర్షాలు పడేవి. వాతావరణ కాలుష్యం వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతాల్లో వచ్చిన మార్పుల వల్ల కుండ పోత వర్షాలు పడుతున్నాయి. భవిష్యత్‌లో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. వరద కాలువలు 10 మీటర్ల వెడల్పుతో ఉన్నవి.. కేవలం 1 నుంచి 2 మీటర్లకు పరిమితమౌతున్నాయి. వీటిని విస్తరించుకోవాల్సి ఉందన్నారు. 24 గంటలూ హైడ్రా డీఆర్ ఎఫ్( డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), మెట్(మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్) టీమ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ఇలా నగరంలో 51 డీఆర్ ఎఫ్ టీమ్‌లు (825 మంది) పని చేస్తుండగా.. 150 మెట్ టీమ్‌లు(2250 మంది) నిరంతరంగా సేవలందిస్తున్నాయి. వీరికి తోడు 240 ప్రాంతాల్లో వరద ముప్పు ఉన్నందున ఆ ప్రాంతాల్లో 24 గంటలూ అందబాటులో ఉండి.. వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు తీసుకునేందుకు 736 మంది స్టాటిక్ సిబ్బంది పని చేస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబరు 1070ని కూడా హైడ్రా తీసుకువచ్చింది. అలాగే వర్షం సమాచారాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసి అప్రమత్తం చేస్తున్నాం.
24,653 క్యాచ్‌పిట్స్ క్లీన్ చేశాం..
24,653 క్యాచ్‌పిట్స్ ఈ వర్షాకాలంలో క్లీన్ చేశాం. 3193 చోట్ల నాలా ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. 7457 చోట్ల వర్షపు నీరు నిలిచిపోతే అక్కడ మట్టిని తొలగించి సమస్యను పరిష్కరించాం. 689 కల్వర్టుల్లో మట్టిని తొలగించి వరద నీటికి ఆటంకాలు లేకుండా చేశాం. ఈ వర్షాకాలంలో 4625 చెట్లు పడిపోతే నిమిషాల వ్యవధిలో వాటిని తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. 319 అగ్ని ప్రమాదాలను అడ్రస్ చేశాం. 221 రెస్క్యూ కాల్స్‌ను అటెండ్ అయ్యాం. కాలువల్లో పూడికపోయిన మట్టిని 2 వేల ట్రక్కులకు పైగా తీశామని.. వర్షాల వేల వరద నివారణకు చర్యలు తీసుకుంటుంటే.. వర్షాలు లేనప్పుడు భారీ మొత్తంలో సిల్ట్ రిమూవ్ చేస్తున్నామన్నారు. 5 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే అమీర్‌పేట మెట్రో స్టేషన్ పరిసరాలు నీట మునిగేవి. అక్కడ భూగర్భ డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో ఇటీవల 10 సెంటీమీర్లకు పైగా వర్షపాతం నమోదైనా నీరు నిలవలేదన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులే ప్రాతిపదికగా..
ప్రతి సోమవారం నిర్వహించే హైడ్రా ప్రజావాణికి ఇప్పటి వరకూ మొత్తం 5 వేలకు పైగా వస్తే ఇందులో 75 శాతం వరకూ క్లియర్ చేశామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. చెరువులు, పార్కులు, రహదారులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా జరిగితే హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ తెలిపారు. వీటికి తోడు మీడియాలో వచ్చిన కథనాలు, వాట్సాప్, ఎక్స్ వేదిక కూడా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైడ్రా విధానంలో భాగంగా నివాసాలుండే ఇళ్లతోపాటు.. అనుమతులున్న కట్టడాలను తొలగించడంలేదని స్పష్టం చేశారు. నగర శివార్లలోని శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ ప్రైవేటు స్థలంలో వేసిన రహదారిని తొలగించలేదని సామాజిక మాధ్యమాలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ పక్కన ఉన్నవారి భూమిలో రహదారి నిర్మించారంటూ ఫిర్యాదు అందిందని.. అది కేవలం ప్రైవేటు వ్యవహారమని తేల్చి చెప్పారు. ఇదే వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆ వెంచర్‌కు ఆనుకుని ఉన్న చెరువును కబ్జా చేస్తే వెంటనే ఆక్రమణలు తొలగించి.. ఆ సంస్త యజమానిపై పోలీసు కేసులు కూడా నమోదు చేశామన్నారు.
జనవరి నాటికి అందుబాటులోకి 6 చెరువులు..
నగరంలో చెరువుల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సిద్ధం చేశామని.. ఇది హైడ్రాకు ఎంతో తృప్తిని, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. అలాగే కూకట్‌పల్లి నల్ల చెరువుతో పాటు.. మొదటి విడతగా చేపట్టిన మొత్తం 6 చెరువుల పునరుద్ధరించడం జనవరి నెల నాటికి పూర్తి అవుతుందన్నారు. ఈ 6 చెరువులు 105 ఎకరాల మేర ఉండగా.. ఆక్రమనలు తొలగించడంతో అవి ఇప్పుడు 180 ఎకరాలకు పెరిగాయన్నారు. ఈ ఆరు చెరువుల విషయంలోనే 75 ఎకరాలు పెరిగితే.. నగరంలో ఇంకా వందలాది చెరువులున్నాయని.. అవన్నీ పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే ఎంత మేర విస్తరణ జరుగుతుందో ఊహించాలన్నారు. ఈ చెరువుల స్థాయి పెరిగితే చాలా వరకు వరద నివారణ చేపట్టవచ్చునని చెప్పారు.