అమెరికాలో హత్యకు గురైన నికితా రావు మృతదేహాన్ని జనవరి 7 లేదా 8 తేదీల్లో భారతదేశానికి తీసుకురానున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన, పరిపాలనా విధానాలు అన్నీ పూర్తయినందున ఆమె మృతదేహాన్ని జనవరి 7 లేదా 8 తేదీల్లో భారతదేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు.
అమెరికాలో తెలుగు యువతి నికితా రావు గుడిశాల దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31వ తేదీ నుండి కనిపించకుండా పోయిన నికిత ఆచూకీ కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. చివరకు మేరీల్యాండ్‌లోని ఆమె బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో జనవరి 3న నికిత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
నికిత మృతి ఘటనపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నరసయ్య తార్నాకలోని విజయపురి కాలనీలో నివసిస్తున్న నికిత తల్లిదండ్రులను వారి నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా నికిత మృతి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె తల్లిదండ్రుల నుంచి పోలీసులు సేకరించారు.