ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తీవ్రంగా స్పందించారు. తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునన్నారు. కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోతుండవచ్చునని రాజాసింగ్ అన్నారు. వారికి పదవి భయం ఉండవచ్చునని, కానీ తనకు ఎలాంటి పదవి ఆశ లేదని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా, తాను కచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు రాజాసింగ్.