నేడు GHMC కౌన్సిల్ సమావేశం.. భారీ బందోబస్తు ఏర్పాటు
హైదరాబాద్: నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
By - Knakam Karthik |
నేడు GHMC కౌన్సిల్ సమావేశం, భారీ బందోబస్తు ఏర్పాటు
హైదరాబాద్: నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై వాడీవేడీగా చర్చ జరగనుంది. మొత్తం 46 ఎజెండా అంశాలపై కౌన్సిల్ చర్చించనుంది. భూముల అమ్మకాలపై కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళికతో ఉన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జిహెచ్ఎంసి కార్యాలయం వరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ప్రజా సమస్యలతో పాటు భూముల అమ్మకాలపై కౌన్సిల్‌లో గట్టిగా నిలదీయాలని గ్రేటర్ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
జీహెచ్‌ఎంసీలో ప్రజా సమస్యలపై అటు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వినూత్న రీతిలో నిరసనలు చేపట్టేందుకు బీజేపీ కార్పొరేటర్లు రెడీ అయ్యారు. ప్రతిపక్షాల ప్రశ్నలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సమాయత్తమవుతుంది. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.