గంజాయి సేవిస్తూ, పబ్బులకు తిరుగుతూ.. అడ్డంగా దొరికిపోయిన డీజే

మాదాపూర్ పోలీసు అధికారులు కొకైన్, గంజాయి సేవించినందుకు ఒక DJ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2024 8:53 PM IST
గంజాయి సేవిస్తూ, పబ్బులకు తిరుగుతూ.. అడ్డంగా దొరికిపోయిన డీజే

మాదాపూర్ పోలీసు అధికారులు కొకైన్, గంజాయి సేవించినందుకు ఒక DJ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌లోని మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్స్‌ డీల్‌ చేస్తున్న డీజేకు సంబంధించిన సమాచారం అందుకున్నాక.. పోలీసులు నిశ్శబ్దంగా అతనిని అనుసరించారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ సేవించి సదరు డీజే వెళుతున్న పబ్‌లను నోట్ చేసుకున్నారు.

అతను కలిసే వ్యక్తులపై కూడా నిఘా ఉంచారు. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వెంటనే మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోని పబ్‌లలో తరచుగా డీజేతో సంబంధం ఉన్న 16 మందిని పోలీసులు పిలిపించారు. వారు 12-ప్యానెల్ అబాట్ యూరిన్ టెస్టింగ్ కిట్‌తో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని పరీక్షించారు. DJ తో సహా ఇద్దరు వ్యక్తులు కొకైన్, గంజాయి విషయంలో పాజిటివ్ గా వచ్చిందని తేలింది. వీరిని అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ సేవిస్తున్న వారిలో మార్పు తీసుకుని రావడానికి కూడా అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం కొద్ది పరిమాణంలో కొకైన్‌తో పట్టుబడిన మహిళను డ్రగ్స్ వాడకానికి దూరంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నించగా అందులో సానుకూల ఫలితం వచ్చిందని తెలుస్తోంది. బయటకు రావాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఎవరైనా సరే డ్రగ్స్ వాడకం నుండి బయటకీ రావచ్చని అధికారులు తెలిపారు.

పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కమిటీలు:

డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘా పెట్టారు అధికారులు. ముఖ్యంగా వారికి దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలను కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు (ఏడీసీలు) ఏర్పాటు చేశామని.. అనుమానం వస్తే స్థానిక పోలీసులకు లేదా టిజిఎఎన్‌బికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఏడీసీలు సమాచారాన్ని సేకరించలేని పక్షంలో రిటైర్డ్ పోలీసు అధికారులను నియమించుకోవాలి. వ్యక్తుల గుర్తింపులను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

ఈ-సిగరెట్లు, వేప్‌లు, చిన్న మద్యం సీసాలు, గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు తదితర వస్తువులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం బ్యాగులు, లాకర్లను యాంటీ డ్రగ్ ప్యానెల్స్ తనిఖీ చేయాలని అధికారులు తెలిపారు. కొన్నిసార్లు, సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లను బెదిరించి డ్రగ్స్, సిగరెట్లను తీసుకుని రావడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ విద్యార్థులు ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని సంప్రదించాలని, వారి పేర్లను వెల్లడించబోమని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌పై ఏదైనా సమాచారాన్ని TGANB కంట్రోల్ రూమ్ నం 87126 71111కు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు అధికారులు.

Next Story