హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా జింక మాంసం విక్రయం చేస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్ఓటీ బృందం అత్తాపూర్ ప్రాంతంలో దాడులు చేపట్టి ఈ అక్రమ దందాను బట్టబయలు చేసింది. ఈ ఘటనలో సులేమాన్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 కిలోల జింక మాంసంతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
అడవుల్లో జింకను వేటాడి, దాని మాంసాన్ని సులేమాన్‌నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎస్ఓటీ సమాచారం మేరకు ముందస్తు నిఘా కొనసాగించిన పోలీసులు.. సరైన సమయంలో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ విషయమై అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అడవిజంతువుల అక్రమ వేట, మాంసం విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని కూడా సూచించారు.