హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి యూనివర్సిటీని సందర్శించి అభివృద్ధిపై ప్రత్యక్షంగా సీఎం రేవంత్ ప్రణాళికలు రూపొందించనున్నారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో గత పర్యటన సందర్భంగా డిసెంబర్‌లో మళ్లీ వస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు.
ఈ మేరకు వెయ్యి కోట్ల రూపాయలతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. త్వరలోనే కేశవరావు కమిటీ సీఎం రేవంత్‌కు నివేదిక సమర్పించనున్నారు. విజన్-2047లో భాగంగా ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.