హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా( తెలంగాణ& ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్మీ అధికారులను సీఎం కోరారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూల్స్ మంజూరు చేశారన్న ముఖ్యమంత్రి.. తెలంగాణలో పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు.
దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో.. లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3 వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కోరారు. నిరంతర చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.