హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, ప్రధాని దిగ్భ్రాంతి
హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, ప్రధాని దిగ్భ్రాంతి
హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదంలో చోటు చేసుకోవడంతో నిద్రలో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. గుల్జార్‌హౌస్ జీ+1 భవనంలో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ వ్యాపారి నగల షాపు నిర్వహిస్తున్నాడు. మొదటి అంతస్తులో కార్మికులు, వ్యాపారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అందరూ కలిపి దాదాపు 20 మంది ఉంటుండగా, మంటలు చెలరేగి పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక 17 మంది స్పృహ తప్పారు.
వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. వారు మార్గం మధ్యలోనే కన్నుమూశారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ కూడా ఉన్నారు. గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50 వేలు అందిస్తామని ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ని ప్రమాదంలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యానని, క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలకు బీఆర్‌ఎస్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.