తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్ రామ్ గుడాలోని కృష్ణ నివాసానికి చేరుకున్న ఆయన నివాళి అర్పించారు. అనంతరం మహేష్ బాబు, మంజులతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కష్టాలను అధిగమించే శక్తిని మహేశ్‌బాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు టాలీవుడ్ దిగ్గజం ఘట్టమనేని కృష్ణ మృతిపట్ల చంద్రబాబు నాయుడు సంతాపం తెలుపుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, హీరోగా, నటుడిగా, సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ మరణం దిగ్భ్రాంతికరమని, సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. కృష్ణ మరణంతో ఓ అద్భుతమైన సినిమా శకం ముగిసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే తల్లిని కోల్పోయి ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ బాబుకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.