మోదీకి వ్య‌తిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. 'సాలు మోదీ.. సంప‌కు మోదీ'

Bye Bye Modi Flexi Removed From Begumpet Ahead of PM's Hyderabad Visit.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జులై 2న హైద‌రాబాద్ కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2022 12:16 PM IST
మోదీకి వ్య‌తిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. సాలు మోదీ.. సంప‌కు మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జులై 2న హైద‌రాబాద్ కు రానున్నారు. హైటెక్స్‌లో జ‌ర‌గ‌నున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. జులై 3న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌లోనూ కూడా పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం ప‌ల‌కాల‌ని, సభను విజయవంతం చేసే పనిలో బీజేపీ క్యాడర్ నిమగ్నమైంది.

అయితే.. బ‌హిరంగ స‌భ జ‌రిగే సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ ప‌రిస‌రాల్లో ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిసాయి. దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ చేసింది ఏమీ లేద‌ని అందులో పేర్కొన్నారు. ప‌రేడ్ గ్రౌండ్ ప‌క్క‌నే ఉన్న టివోలీ థియేట‌ర్ సిగ్న‌ల్ వ‌ద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో 'సాలు మోదీ.. సంపకు మోదీ' అని రాస్తూనే బైబై మోదీ అనే ట్యాగ్ ను జోడించారు.

నల్లధనం వెనక్కి తెప్పించడం సహా, నోట్ల రద్దు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్‌, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్‌ అని, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నించారు. అయితే.. ఈ ఫ్లెక్సీల‌ను ఎవ‌రు ఏర్పాటు చేశారు అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. స‌మాచారం అందుకున్న కంటోన్‌మెంట్ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ప‌రేడ్ గ్రౌండ్స్ ప‌రిస‌రాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను తొల‌గించారు.

Next Story