కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By - Knakam Karthik |
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇంటింటికి కాంగ్రెస్ బకాయి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువన్న భ్రమల్లో రేవంత్ సర్కార్ ఉంది. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పే అద్భుత అవకాశం జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో తెలంగాణ ప్రజలకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. జూబ్లిహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నది టూరిస్టు మంత్రులు. ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ గాయబ్ అవుతారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తాం..అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుద్ధ్య పనులు రోజూ జరిగేవి అయితే ఇప్పుడు చెత్త తీసేవారే కరువయ్యారు. మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి, ఇన్వర్టర్లు కొనుక్కుంటున్నాం అని పలువురు మహిళలు, పెద్దలు కేటీఆర్ తో తమ ఆవేదన పంచుకున్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు కేటీఆర్. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పారు.