సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంపై పగ బట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ, హైడ్రా పేరిట ఇప్పటికే హైదరాబాద్ లో సీఎం సమస్యలు సృష్టించారు.. ఇపుడు మెట్రో రైలు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. ప్రతి మెట్రో ప్రయాణీకుడిపై నెలకు ఆరువందల రూపాయలపైనే కనీస భారం పడుతుందని అన్నారు. కొన్ని మహానగరాల్లో మెట్రో చార్జీలు పెంచితే ప్రయాణికులు తిరగబడితే పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని.. తక్షణమే మెట్రో చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌ను తిరోగమనం వైపు తీసుకెళ్లే ఏ నిర్ణయం మంచిది కాదన్నారు. ప్రజారవాణాకు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా తక్కువేనన్నారు. అసలే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.. రిజిస్ట్రేషన్ ఆదాయం నెలకు 200 కోట్ల రూపాయల మేర తగ్గింది.. కొంత కాలం నష్టమైనా మెట్రో చార్జీలు పెంచకూడదన్నారు. ప్రతిపాదించిన కొత్త మెట్రో మార్గాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. కేసీఆర్ హాయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మెట్రో చార్జీలు పెంచలేదని.. కరోనా సమయంలో మెట్రో రైలు నష్టాల్లో నడిచినా కేసీఆర్ చార్జీల పెంపు నిర్ణయానికి ఒప్పుకోలేదన్నారు.