హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఊరేగింపును ఆలస్యం చేశారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఆరోపించారు. ఏప్రిల్ 17న అనధికారిక ర్యాలీ నిర్వహించినందుకు శాసనసభ్యుడిపై అఫ్జల్‌గంజ్, సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో రామనవమి ర్యాలీ సందర్భంగా పోలీసులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించారని రాజా సింగ్ ఆరోపించారు. ర్యాలీ నిర్వహణలో పోలీసులు జాప్యం చేయడంతో చాలా మంది భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మంగళవారం గౌలిగూడ రామమందిరం వద్ద ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్‌లో ముగిసింది. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.