జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఫలితాల సరళిని గమనించి, ఏడో రౌండ్ కౌంటింగ్ జరుగుతుండగానే కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే, రౌండ్లు గడిచేకొద్దీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ క్రమంగా తన ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఫలితాల సరళి స్పష్టంగా కనిపిస్తుండటంతో, దీపక్ రెడ్డి కౌంటింగ్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అక్కడి నుంచి వెళుతున్న సమయంలో అక్కడున్న మీడియాతో ఆయన మాట్లాడుతూ... బీజేపీ పార్టీ ఎన్నికల్లో డబ్బు పంచదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచాయని ఆరోపించారు.