హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగా ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెలవు ప్రకటించారు. అనేక పాఠశాల యాజమాన్యాలు "ప్రియమైన తల్లిదండ్రులారా, బుధవారం భారత్ జోడో యాత్ర కారణంగా ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు సెలవు ప్రకటించబడింది" అని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసులు రోడ్డు వాహనదారులకు బోయిన్‌పల్లి - బాలానగర్ - వై జంక్షన్ - జెఎన్‌టియు, చందానగర్‌లను వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తూ ట్రాఫిక్ సలహా కూడా జారీ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నగరంలో కొనసాగుతోంది. కూకట్ పల్లి, జెఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన రాహుల్ టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభంకానుంది. మియాపూర్, రామచంద్రపురం, పఠాన్‌చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొననున్నారు. ఆ తర్వాత రుద్రారమ్ గణేష్ మందిర్‌లో రాహుల్ బస చేయనున్నారు.