హైదరాబాద్‌లో 163 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ
163 inspectors were transferred in Hyderabad. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు.
By Medi Samrat
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు కొత్త ప్రదేశాలలో త్వరగా రిపోర్ట్ చేయాలని సీపీ ఆదేశించారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్.. ఇన్‌స్పెక్టర్లు, పై స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. మెగా సిటీ పోలీసింగ్ ప్లాన్ లో భాగంగా ఇటీవల సిటీలో పోలీసు పునర్వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాలు, పోలీసింగ్ మార్పుల గురించి సీపీ వివరించారు.
అంతేకాకుండా కొత్త అధికారులకు పరిస్థితులు, పాలనాపరమైన సమస్యలను గురించి కూడా వివరించారు. పదవీ విరమణ చేసిన అధికారులకు హైదరాబాద్ సీపీ కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో భాగంగా వారందరూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నూతన అధికారులను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ.. నగర పోలీసింగ్‌పై త్వరగా అవగాహన చేసుకుని.. మంచి సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగా అన్నివేళల్లో ప్రజలకు సేవ అందించాలంటూ సూచించారు. కొత్త అధికారులు ఇన్ ఫ్రా, మాన్ పవర్, మెటీరియల్, కొత్త యూనిట్లు, ఇతర వనరులు అన్ని స్థాయిలో ఉపయోగించుకొవాలని తెలియజేశారు. మా సిబ్బంది, అధికారుల సంక్షేమమే మాకు చాలా ముఖ్యం. అన్ని జోన్లలో ఖచ్చితంగా మూడు షిఫ్ట్ లు ఉంటాయని తెలియజేశారు. కొత్తగా విధుల్లో చేరిన ఇన్‌స్పెక్టర్లు వివక్ష లేకుండా ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటూ సీపీ సూచించారు.