డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2020 1:07 PM IST
డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి

ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది. సుధాకర్‌ తల్లి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఈ రోజు విచారించింది. ఆసుపత్రి సూపరిండెంట్ కు తెలియజేసి ఏ క్షణమైనా డిశ్చార్జ్ కావచ్చునని హైకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.

సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాధిపదికన ఆస్పత్రిలో బంధించారని సుధాకర్‌ తల్లి పిటిషన్‌లో పేర్కొంది. ఇరు వైపులా వాదనలు విన్న తర్వాత డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గత నెల 16 నుంచి సుధాకర్‌ విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యులకు సౌకర్యాల కల్పనలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరో కేసులో సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేసి ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ మానసిక చికిత్సాలయానికి తరలించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి..కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నర్సీపట్నం చేరుకుని మునిసిపల్ కమిషనర్ ను విచారించారు. అంతకు ముందు సుధాకర్ పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సుపరింటెండేంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే హాజరు పట్టీ పరిశీలించారు.

Next Story