హెలికాప్టర్ షాట్ విన్నాం.. కానీ ఈ 'హెలికాప్టర్ మనీ' ఏంటీ..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 April 2020 4:34 AM GMT
హెలికాప్టర్ షాట్ విన్నాం.. కానీ ఈ హెలికాప్టర్ మనీ ఏంటీ..?

శ‌నివారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ అంశం, క‌రోనా వైర‌స్ వ్యాప్తి, జాగ్ర‌త్త‌లు, కేంద్రం స్పంద‌న ఇలా ప‌లు విష‌యాల‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక.. ముందు ఊహించిన‌ట్లుగానే లాక్‌డౌన్ పొడిగిస్తున‌ట్లు ప్ర‌క‌టించ‌గా.. మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ప్ర‌స్తావించారు. అందులో దేశ ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ.. హెలికాప్టర్ మనీ అనే అంశం ఒక‌టి.

ఈ అంశంపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థికరంగంలో 'క్యూఈ' (క్వాంటిటేటివ్ ఈజింగ్) అనేది ఎంతో ఉపయోగ‌క‌ర‌మైన‌ ప్రక్రియ.. చైనాకి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, జపాన్ కు బ్యాంక్ ఆఫ్ జపాన్, యూకేకు బ్యాంక్ ఆఫ్ లండన్ అలాగే మ‌న భార‌త్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ప్రతి దేశానికి ఓ గవర్నింగ్ బ్యాంకు ఉంటుంది. అయితే.. దేశం గ‌డ్డు పరిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ఈ గవర్నింగ్ బ్యాంకులు ముందుకొచ్చి 'క్యూఈ' విధానాన్ని అమలు చేస్తాయి. క్యూఈ విధానంలో ఓ దేశానికి ఎంత జీడీపీ ఉందో.. అందులో కొద్ది శాతాన్ని ఆ గవర్నింగ్ బ్యాంకు ప్రభుత్వాల ద్వారా మార్కెట్లలో రిలీజ్ చేస్తుంది. దీనిద్వారా గ‌డ్డు పరిస్థితుల నుంచి ఆయా దేశాల‌కు ఉప‌శ‌మ‌నేది ఉంటుందని అన్నారు.

అయితే.. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు 10 శాతం క్యూఈ ప్రకటించిందని.. దీంతో ట్రంప్ 2 ట్రిలియన్ డాలర్లను అమెరికా సమాజంలో ప్రవేశపెట్టారని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రాల ఆర్థికపరిస్థితి, దేశ ఆర్థికపరిస్థితి ఏం బాగాలేదు. మ‌న‌దేశంలోనూ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. మన జీడీపీ 203 లక్షల కోట్ల రూపాయలని.. దాంట్లో కనీసం ఐదు శాతం అంటే రూ. 10 లక్షల కోట్లను ప్ర‌భుత్వం ద్వారా సమాజంలో ప్రవేశపెట్టాలని కోరారు.

దీనిద్వారా.. వ్యాపార‌, కార్మిక, వ్య‌వ‌సాయ రంగాల‌కు ఎంతోకొంత సాయం చేయాలని అన్నారు. ప్ర‌స్తుత‌మున్న సంక్షోభ స‌మ‌యంలో సమాజంలోకి నగదు పంప్ చేస్తే అది సామాన్య ప్ర‌జానీకానికి ఎంతో ఊరట కలిగిస్తుందని కేసీఆర్‌ అన్నారు. దీనిని అంతర్జాతీయంగా హెలికాప్టర్ మనీ అంటారని.. హెలికాప్టర్ నుండి డబ్బును కింద‌కి జ‌ల్లితే ఎలా ఉంటుందో.. 'క్యూఈ' విధానం కూడా అలాంటిదే అని కేసీఆర్ అన్నారు.

Next Story