వారి కోసం.. జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాలు
By అంజి Published on 29 March 2020 10:37 AM IST
అమరావతి: కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలోని జిల్లాల మధ్య రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వేరే జిల్లాల వారికి కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో క్వారంటైన్ నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్‌లో ఉన్న వారికి మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, నీటి వసతి కల్పించాలని సూచించింది. ఆయా క్యాంపుల్లో సౌకర్యాల కల్పన చూసేందుకు కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు. కలెక్టర్లతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పీయూష్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. క్వారంటైన్‌లో ఉన్న వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వసతులపై ఆరా తీయడంతో, సమస్యల పరిష్కారం.. అలాగే ప్రతి రోజూ నివేదికను సీఎం కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
Also Read: నయమైనా.. 8 రోజుల దాకా..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో చాలా మంది ఆంధ్రులు నిలిచిపోయారు. వీరందరి బాగోగులను చూసేందుకు నోడల్ ఆఫీసర్‌గా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రను ప్రభుత్వం నియమించింది. సరిహద్దుల్లో నిలిచిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో భోజనం, మంచినీరు, వసతి, అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. కర్నాటకలోని కోలార్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు నిలిచిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు