భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్‌ కేసులు

By Newsmeter.Network  Published on  29 March 2020 4:57 AM GMT
భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా మరో దశలోకి ప్రవేశించినట్లు ప్రస్తుతం నమోదవుతున్న కేసులు వెల్లడిస్తున్నాయి. వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. అయిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. అనధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటినట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 933 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read :నయమైనా.. 8 రోజుల దాకా..

వారం రోజుల్లోనే దేశంలో కొత్తగా దాదాపు 800కు పైగా కేసులు నమోదు కావటం ఆందళనకు గురిచేసే అంశంగా మారింది. మరోవైపు శనివారం ఒక్క రోజే 230 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం భయాందోళనకు గురిచేసే అంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశంలో మహారాష్ట్రంలో అత్యధికంగా 186 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే మహారాష్ట్రంలో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేరళలలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Also Read :లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌.. కండోమ్‌లకు యమ గిరాకీ!

దేశవ్యాప్తంగా 21 మంది కరోనా వైరస్‌ భారినపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా ఆదివారం అహ్మదాబాద్‌లోని 45ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు సమాచారం. రాష్ట్రాల వారిగా పాజిటివ్‌ కేసులు చూస్తే.. మహారాష్ట్రలో 186, కేరళలో 182, ఢిల్లిలో 49, ఉత్తరప్రదేశ్‌లో 65, కర్ణాటకలో 81, లడఖ్‌ లో 13, తెలంగాణలో 67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాజస్థాన్‌లో 54, జమ్మూ కశ్మీర్‌లో 33, గుజరాత్‌లో 55, ఆంధ్రప్రదేశ్‌లో 19, తమిళనాడులో 42, మధ్య ప్రదేశ్‌లో 39, పంజాబ్‌లో 38, హర్యానాలో 35, పశ్చిమ బెంగాల్‌లో 18, బీహార్‌లో 11, అండమాన్‌ నికోబార్‌ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10 లోపు కేసులు నమోదయ్యాయి. వీరందరిలో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :కరోనా ఎఫెక్ట్‌.. నాలుగు నిమిషాల్లో ముగించేశారు..!

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రెండు ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా నిర్వహించినా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.. ఇప్పటికే తెలంగాణలో 67 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. శనివారం ఒక్క రోజే ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో తొలి మరణం చోటు చేసుకుంది. ఏపీలోనూ కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇండ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంది. కరోనా అనుమానిత కేసులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం నాటికి ఏపీలో 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story