హెచ్‌డీఎఫ్‌సీ నుండి ఆ ఆరుగురిని తొలగించేశారు.. చేసిన మోసమేమిటంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 7:04 AM GMT
హెచ్‌డీఎఫ్‌సీ నుండి ఆ ఆరుగురిని తొలగించేశారు.. చేసిన మోసమేమిటంటే..!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన హెచ్.డి.ఎఫ్.సి. ఆరుగురు ఉద్యోగులను తొలగించేసింది. సీనియర్, మధ్య తరహా అధికారులైన వీరు బ్యాంకు నియమాలను బేఖాతరు చేస్తూ, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో ఉద్యోగాల నుండి తొలగించారు.

కార్ లోన్ తీసుకున్న కష్టమర్లతో కావాలనే జిపిఎస్ పరికరాలను కొనేలా చేయించడం వెనుక వీరి హస్తం ఉందని బ్యాంకు ఉన్నతాధికారులు భావించారు. కొందరు కష్టమర్లకు.. తాము వాహన ట్రాకింగ్ డివైజ్ లు కొన్నామని కూడా తెలీదని అంతర్గత విచారణలో బయటపడింది. 18000-19500 రూపాయల విలువైన జీపీఎస్ డివైజ్ లను 2015 నుండి డిసెంబర్ 2019 వరకూ కార్ లోన్ తీసుకున్న వారితో కొనుగోలు చేయించిందని వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. దీన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ దగ్గర నుండి జీపీఎస్ పరికరణాలను కొనుగోలు చేయించారని తెలుస్తోంది. ప్రతి నెలా 4000-5000 వరకూ ఈ పరికరాలను కార్ లోన్ తీసుకున్న వాళ్లు కొనుక్కునేలా ఈ వ్యక్తులు ప్రవర్తించారు. ఇది కార్ లోన్ తీసుకున్న వారిని మోసం చేసినట్లే అవుతుందని బ్యాంకు ఉన్నతాధికారులు భావించి వారిని విధుల నుండి తొలగించారు.

హెచ్.డి.ఎఫ్.సి. ప్రతి నెలా 55,000కు పైగా వాహనాలకు లోన్స్ ఇస్తూ ఉంటుంది. అతి పెద్ద ఆటో ఫైనాన్సర్లలో ఈ బ్యాంకు ఒకటి. అటువంటిది కొందరు అధికారుల వలన మరక అంటుకోకూడదని బ్యాంకు భావిస్తోంది.

Next Story
Share it