ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వచ్చినవారికి ఏపీలో వర్తించే ఆంక్షలేమిటి ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2020 2:17 AM GMT
ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా వచ్చినవారికి ఏపీలో వర్తించే ఆంక్షలేమిటి ?

లాక్ డౌన్ 5.O లో ఇచ్చిన కొన్ని సడలింపులు, మార్గదర్శకాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజారవాణా వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో అంతర్రాష్ట్ర రవాణాలు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్నాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా పరిమిత సంఖ్యలో కొన్ని ప్రధాన స్టేషన్లకు రైళ్లను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు జూన్ 1వ తేదీ నుంచి రైలు మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోకి వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు కానీ.. శ్వాబ్ టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉండాలని మాత్రం సూచించాయి.

కానీ ఏపీలో మాత్రం మే 31వ తేదీ అర్థరాత్రి వరకూ రాష్ట్రంలోకి ప్రయాణికుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు పెడుతున్నదీ చెప్పలేదు. అర్థరాత్రి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రోడ్డు మార్గం ద్వారా ఎలాంటి వాహనంలో వచ్చేవారైనా సరే..రాష్ట్రంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ పాస్ ఉండాలని సంచలన ప్రకటన చేశారు. ఈపాస్ లేకపోతే 14 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో అప్పటివరకూ ఏపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పకపోవడంతో ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. ఇదేదో ముందే చెప్పుంటే ఈపాస్ తీసుకునే వాళ్లం కదా..ఉన్నట్లుండి ఇలా ప్రకటిస్తే బోర్డర్ లో నిలిచిపోయిన మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు కొందరు ప్రయాణికులు. వారే కాదు..ఏపీ డీజీపీ హఠాత్ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక రాష్ట్రంలోకి రైళ్ల మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం ఆయా ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద ఆన్ ది స్పాట్ శ్వాబ్ టెస్టులు చేసే వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల సహాయంతో గంటకు 200 మందికి శ్వాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర రైల్వే స్టేషన్ల వద్ద ఈ శ్వాబ్ టెస్టులు చేసే వాహనాలను ఏర్పాటు చేశారు. టెస్టులు చేసే సమయంలో ఏ విధమైన కరోనా లక్షణాలు ఉన్నా వారిని వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, మరోసారి కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తారు. శ్వాబ్ టెస్టుల్లో ఏ లక్షణాలు లేనివారు కనీసం 7 రోజులైనా హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Next Story