ఇష్టం ఉంటేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే.. విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు
By సుభాష్ Published on 16 Sept 2020 2:55 PM IST![ఇష్టం ఉంటేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే.. విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు ఇష్టం ఉంటేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే.. విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/09/Guidelines-for-educational-institutions.jpg)
అన్‌లాక్ 4.0లో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించింది. విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లాలని, లేకుండా ఇంట్లో ఉండే ఆన్‌లైన్ క్లాసులు వినవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పాఠశాలకు వెళ్లని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా లేఖను సమర్పించాలని పేర్కొంది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు
► కంటైన్‌మెంట్ జోన్లకు బయట ఉన్న విద్యాసంస్థలనే తెరవాలి. కంటైన్‌మెంట్ జోన్లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బడికి
► రావద్దుతరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్ చేయించాలి
► ఒక వేళ కరోనా సమయంలో పాఠశాలలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చినట్లయితే వందశాతం శానిటైజ్ చేయాలి
► పాఠశాలకు రావాలా..? వద్దా..అనే ఆప్షన్‌ను విద్యార్థులకే వదిలేయాలి
► పాఠశాలలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
► పాఠశాలకు వచ్చే విద్యార్థులు, సిబ్బంది భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి
► తరగతి గది ఉష్ణోగ్రతలు 24-30 సెల్సియస్‌డిగ్రీలు, తేమ40-70 శాతంగా ఉండాలి
► గదులు గాలి వచ్చేలా ఉండాలి. స్వచ్చమైన గాలిని పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచే ఉంచాలి
► విద్యార్థులు ఉపయోగించే లాకర్లు, అల్మారాలను రోజుకోసారి శానిటైజేషన్ చేయాలి. ఈత కొలనులను తెరవవద్దు
► క్లాసుల్లో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లను ఒకరికొకరు మార్చుకునేందుకు అనుతించరాదు
► ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని అనుమతించాలి. ప్రయోగశాలల్లో పరికరాలు వాడక ముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిలైజ్ చేయాలి
► బస్సుల్లో విద్యార్థులను తరలించే సమయంలో భౌతిక దూరం పాటించాలి
► తరగతులు, ప్రయోగశాలల్లో విద్యార్థులు తాకే ప్రాంతాలన్నింటిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తుండాలి
► పాఠశాల ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత రెండుసార్లు శానిటైజ్ చేయాలి
► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను 70శాతం ఆల్కహాల్ గల వైపర్లతో క్రిమికీటకనాశం చేయాలి
► తాగునీరు, హ్యాండ్‌వాష్ స్టేషన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
► సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడిన మాస్క్‌లు ప్రత్యేక డబ్బాల్లో వేయాలి
► విద్యార్థులు, సిబ్బంది పాఠశాల ఆవరణలో, ఆరుబయట, రోడ్లపై గుమిగూడవద్దు
► విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైన వారిని పాఠశాలకు రావద్దని ఆదేశించాలి
► విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైన ఆనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యున్ని సంప్రదించేలా చర్యలు తీసుకోవాలి
► అనారోగ్యానికి గురైనవారికి కరోనా వచ్చినట్లయితే వారు తిరిగిన ప్రదేశాలను శానిటైజేషన్ చేయాలి
► విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య కనీసం ఆరు ఫీట్ల భౌతిక దూరం ఉండేలా చూడాలి. ప్రతి ఒక్కరికి మాస్క్‌లు తప్పనిసరి.
► పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడం నిషేధం. అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉండాలి
► ఏదైన అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి రాష్ట్ర, స్థానిక ఆరోగ్య సిబ్బంది హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రదర్శించాలి
► పాఠశాలలు తెరిచిన తర్వాత శానిటైజర్లు, మాస్క్‌లు పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవాలి
► థర్మల్ గన్స్, ఆల్కహాల్‌వైపర్లు, సబ్బులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఐఈసీలను అందుబాటులో ఉంచుకోవాలి