భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పిన అమెరికా సెనేటర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 11:08 AM ISTవాషింగ్టన్: ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డు దక్కితే చాలు అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 సంవత్సరాలు ఎదురుచూడాల్సి ఉంటుందని ఓ రిపబ్లికన్ సెనేటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.
గ్రీన్ కార్డు లభిస్తే శాశ్వతంగా అమెరికాలో నివసించే అవకాశం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడ నివసిస్తున్న వాళ్లకు గ్రీన్ కార్డు ఇస్తారు. అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునేవారికి ప్రస్తుతమున్న ఇమ్మిగ్రేషన్ విధానంలో భాగంగా గ్రీన్ కార్డు అందాలంటే చాలా కష్టమని అమెరికా సెనేటర్ మైక్ లీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. భారత్ నుంచి వచ్చేవాళ్లు ఎవరైనా గ్రీన్ కార్డు కోరుతూ బ్యాక్ లాగ్ వెయిటింగ్ లిస్టులో చేరితే వారు ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు మరణించిన సందర్భాల్లో వారి సంతానానికి ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం ఏ విధంగానూ ఉపయోగపడడంలేదని అన్నారు.
2019లో భారతీయులలో 9008 మందికి కేటగిరీ 1 (EB1), 2908 మందికి కేటగిరీ 2(EB2), 5083 మందికి కేటగిరి 3(EB3) కింద గ్రీన్ కార్డులు దక్కాయి. ఇవన్నీ ఎంప్లాయిమెంట్ కింద ఇచ్చే గ్రీన్ కార్డులు.
గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుండడంతో వారు తమ వలస హోదాను కూడా కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని మరో సెనేటర్ డిక్ డర్బిన్ అభిప్రాయపడ్డారు. డర్బిన్ వ్యాఖ్యలపై మైక్ లీ స్పందిస్తూ, ఈ సమస్యకు చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొనేందుకు కలిసి రావాలని ఇతర సెనేటర్లకు విజ్ఞప్తి చేశారు.
'మీరు మీ పిల్లలను అమెరికాకు తీసుకుని వచ్చింటారు.. హెచ్-1 బి వీసా కింద వచ్చి మీ పిల్లల గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. స్కూల్స్, కాలేజీల ఫీజులు కడుతూ ఉంటారు.. ఎందుకంటే వారికి అమెరికా పౌరులుగా గుర్తింపు వచ్చి ఉండదు కాబట్టి.. ఎప్పుడైతే పిల్లలకు 21 సంవత్సరాల వయసు వస్తుందో వారు అప్పుడు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఓ కుటుంబాన్ని విడదీసిన వాళ్ళము అవుతాము.. తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు విలువన్నది లేకుండా పోతుంది. ఇలా జరిగే వరకూ మనం చూస్తూ ఉండాలా..?' అని డర్బిన్ వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది యువతీ యివకులు ఇబ్బందులు పడాలని తాను కోరుకోవడం లేదు.. మన ఇమ్మిగ్రేషన్ సిస్టంను మారుద్దామని డర్బిన్ కోరారు.