Fact Check : తండ్రి కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయిని రేప్ చేసి చంపేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2020 5:52 PM ISTబీహార్ రాష్ట్రంలోని దర్బంగా జిల్లాలో జ్యోతి పాశ్వాన్ అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశారంటూ వార్తలు వచ్చాయి. తన తండ్రి కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతిని రేప్ చేసి చంపేశారని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు.
‘Justice for Jyoti Paswan’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెట్టారు. గాయపడిన తన తండ్రిని లాక్ డౌన్ సమయంలో 1200 కిలోమీటర్లు వెనుక సీట్ లో కూర్చోపెట్టి తొక్కిన అమ్మాయిని చంపేశారంటూ పలువురు భావిస్తూ ఉన్నారు. జులై 1వ తేదీన జ్యోతిని రేప్ చేసి చంపేశారంటూ వార్తలు వచ్చాయి.
నిజ నిర్ధారణ:
తండ్రి కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతి కుమారి పాశ్వాన్ ను రేప్ చేసి చంపేశారన్నది పచ్చి అబద్ధం.
లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారు. సరైన రవాణా సదుపాయాలు లేక, ఉన్న చోట ఉపాధి లేక ఎంతో మంది కాలి నడకన ప్రయాణాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. మరి జ్యోతి కుమారి పాశ్వాన్ కూడా తన తండ్రి కోసం సైకిల్ లో ప్రయాణాన్ని మొదలు పెట్టి క్షేమంగా తీసుకుని వెళ్ళింది.
మోహన్ పాశ్వాన్ కూడా ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తే..! అతడి సొంత ఊరు బీహార్ రాష్ట్రం దర్బంగా జిల్లా సిర్హుల్లి. మోహన్ పాశ్వాన్ హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ దగ్గర ఉన్న సికందర్పూర్ లో ఆటో రిక్షా డ్రైవర్ గా పని చేస్తూ ఉండే వాడు. లాక్ డౌన్ విధించే సమయానికి మోహన్ పాశ్వాన్ కు గాయం కూడా అయ్యింది. మోహన్ కుమార్తె తన తండ్రిని వెనుక కూర్చోపెట్టుకుని సిర్హుల్లి దాకా తొక్కింది. దాదాపు 1200 కిలోమీటర్లు ఆమె సైకిల్ తొక్కడం సంచలనమైంది. ఆమె అక్కడికి చేరుకున్నాక క్వారెంటైన్ లో ఉంచారు.
జ్యోతి కుమారి పాశ్వాన్ కు సంబంధించిన వార్తలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.
జూన్ 1, జ్యోతి పాశ్వాన్ అనే అమ్మాయి పాతోర్ గ్రామంలో మరణించింది. మాజీ సైనికాధికారికి చెందిన మామిడి తోటలో ఆమె కరెంట్ షాక్ కారణంగా మరణించిందని చెబుతున్నారు. జ్యోతి పాశ్వాన్ తండ్రి అశోక్ పాశ్వాన్ మాత్రం తన కుమార్తెను తోట యజమాని హత్య చేసి చంపేశాడని ఆరోపిస్తూ ఉన్నాడు. మామిడి పళ్ల కోసం వెళ్లిన తన కుమార్తెను మాజీ సైనికాధికారి చంపేశాడంటూ ఆరోపణలు గుప్పించాడు.
ఇద్దరు అమ్మాయిల పేర్లు జ్యోతి కావడంతో పలువురు తండ్రి కోసం సైకిల్ తొక్కిన అమ్మాయిని చంపేశారని భావించారు. కానీ తండ్రుల పేర్లు వేరే ఉండడం గమనించవచ్చు. 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతి తండ్రి పేరు మోహన్ కాగా, చనిపోయిన జ్యోతి తండ్రి పేరు అశోక్ పాశ్వాన్.
జన అధికార్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పప్పు యాదవ్ అశోక్ పాశ్వాన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పి.. జ్యోతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జులై 3న పాతోర్ కు ఆయన వెళ్లారు.
పై ఫోటోల ద్వారా మోహన్ పాశ్వాన్, అశోక్ పాశ్వాన్ లలో తేడాలను గమనించవచ్చు.
1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన జ్యోతి కుమారి పాశ్వాన్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఆమె మీద సినిమా తీయడానికి కూడా సంకల్పించారు. మెయిన్ లీడ్ రోల్ లో ఆమె నటించబోతోంది. Indian Express జులై 4న ఈ కథనాన్ని ప్రచురించింది. జ్యోతి పాశ్వాన్ చనిపోయిన రెండు రోజులకు ఈ కథనం వచ్చింది.
https://indianexpress.com/article/sports/sport-others/bihar-cycle-girl-turns-down-trial-6425115/
జ్యోతి కుమారి పాశ్వాన్ తన తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు తొక్కిన అమ్మాయిని రేప్ చేసి హత్య చేశారన్నది 'అబద్దం'. రేప్ చేసి చంపబడిన మరో అమ్మాయి జ్యోతికి న్యాయం జరగాలని న్యూస్ మీటర్ డిమాండ్ చేస్తోంది.