జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ముర్ము రాజీనామా!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  7 Aug 2020 12:55 AM GMT
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ముర్ము రాజీనామా!

గిరీశ్‌ చంద్ర ముర్ము జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులై ఏడాది తిరగక ముందే ఆ పదవికి రాజీనామా చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ పరిణామం వెనక చాలా కారణాలు ఉండవచ్చని కొందరి భావన. ఈ విషయంగా ఇండియాటుడే.ఇన్‌లో వార్తాకథనం ప్రచురితమైంది.

ఇంత త్వరితంగా జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసినట్టు రాష్ట్రపతి భవన్‌ నుంచి మీడియాకు సమాచారం వెలువడింది. జమ్ముకశ్మీర్‌ కొత్త గవర్నర్‌గా భజపా నేత, కేంద్ర మాజీ మంత్రి మనోజ్‌ సిన్హాను నియమించినట్లు తెలుస్తోంది. కాగా ముర్ము గురువారం ఢిల్లీలో భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా నియమితు లయ్యారు.

ఈ అనూహ్య పరిణామం జమ్ముకశ్మీర్‌లోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే కారణాలేమై ఉండవచ్చో అని పరిశీలకులు లోతుగా ఆలోచిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం దాకా ఎలాంటి సమాచారం వెలువడకపోగా ఆదే రోజు రాత్రి ముర్ము తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియడం కొందరికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

జీసీ ముర్ము 1985 బ్యాచికి చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ గుజరాత్‌ కేడర్‌లో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సేవలందించారు. ముర్ము తన కార్యనిర్వహణలో ప్రత్యేకతను కనపరిచేవారని పేరు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుచేసినప్పటి నుంచి, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా మార్చినప్పటి నుంచి రాజకీయ శూన్యత కొంతవరకు ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం జమ్మూ కశ్మీర్‌ రాజకీయ వ్యవహారాలతోపాటు, పాలనా దక్షత ఉంటే మేలని భాజపా నేతను గవర్నర్‌గా నియమించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పాలనతోపాటు ప్రజలతో నేరుగా మమేకం కావలసిన అవసరం ఉంది. మనోజ్‌ సిన్హాకు ఈ రెండిటిలో సామర్థ్యం ఉండటంతో తనను నియమించినట్లు తెలుస్తోంది. జితేందర్‌సింగ్‌ యూనియన్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ మాట్లాడుతూ ‘మనోజ్‌ సిన్హాకు అభినందనలు తెలియజేశాను. ఆయనకు రాజకీయ నేపథ్యంతోపాటు నిర్వహణ అనుభవం పుష్కలంగా ఉంది’ అని తెలిపారు. అలాగే నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ సీనియర్‌ లీడర్‌ ముస్తాఫా కమల్‌ మాట్లాడుతూ ‘ ఈ కొత్త మార్పు సరైన నిర్ణయమే కావాలని ఆశిద్దాం.’ అన్నారు.

మనోజ్‌ సిన్హా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియామకం వెనక రాజకీయ అనుభవం ఉంటే బావుంటుందన్న ఆలోచన ఉండొచ్చు. ఇదే కాకుండా మరికొన్ని కారణాలు కూడా జి.సి.ముర్ము నిష్క్రమణకు దారితీసి ఉంటాయని కూడా పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ముర్ము జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ పునరుద్ధరణపై ,అసెంబ్లీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు, కూడా కారణమై ఉంటుందని పలువురి భావన. జమ్మూ కశ్మీర్‌ లాంటి సున్నితమైన రాష్ట్రం అధికారుల నియామక ప్రయోగాలకు సరైన వేదికా కాదేమోనన్న వాదనలూ లేకపోలేదు.

‘ముర్ము హయంలో రాష్ట్ర పాలనా యంత్రాంగం రెండు వర్గాలుగా విడిపోయింది. అంతర్గత విభేదాలు పెరిగిపోయాయని జాఫర్‌ చౌదరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే బుధవారం రాత్రి ముర్ము రాజీనామాతో కొద్దిపాటి దుమారం తలెత్తినా, ఆయన గురువారం కాగ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడంతో అంతా సర్దుకుందని పరిశీలకులు అంటున్నారు.

Next Story