సిగ‌రెట్లు మానేశాడు.. ల‌క్ష‌లు పోగేశాడు.. ఆ డ‌బ్బుతో ఇల్లు క‌ట్టాడు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 1:03 PM GMT
సిగ‌రెట్లు మానేశాడు.. ల‌క్ష‌లు పోగేశాడు.. ఆ డ‌బ్బుతో ఇల్లు క‌ట్టాడు.!

ఎప్పుడో ఒక‌సారి తాగితే 'స‌ర‌దా'.. అప్పుడప్పుడు తాగితే 'అల‌వాటు'.. రోజూ తాగితే 'రోగం'.. ఇది సినిమా డైలాగ్‌లా వున్నా అక్ష‌ర‌స‌త్యం. అల‌వాట్ల‌కు బానిస‌లై కుటుంబాల‌ను నాశ‌నం చేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను మ‌నం రోజు చూస్తూనే ఉన్నాం. ఇందుకు భిన్నంగా.. మనసు నిగ్రహంతో ఉంటే ఏ అలవాటునైనా మానుకోవచ్చని నిరూపించాడు కేరళకు చెందిన ఓ పెద్దాయన.

తన అల‌వాట్ల‌ను మానుకుని.. ఆ సొమ్ముతో ఏకంగా బిల్డింగే కట్టేస్తున్నాడు ఆ పెద్ద‌మ‌నిషి. అంతేకాదు తనలా నిగ్ర‌హంతో చెడువ్య‌స‌నాల‌కు దూరంగా ఉంటే ఆర్థికంగా బాగుపడుతారంటూ స‌ల‌హా కూడా ఇస్తున్నాడు. వివ‌రాళ్లోకెళితే.. కేర‌ళ‌లోని కోజికోడ్‌ ప్రాంతానికి చెందిన నాయ‌ర్‌ వయసు 75 సంవత్సరాలు. నిర్మాణ రంగంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణుగోపాల్ నాయర్‌కు ప్ర‌తిరోజూ సిగ‌రెట్ తాగే అలవాటు ఉంది. దానికి మరి బానిస అయిపోయాడు.

నాయ‌ర్‌ త‌న 13వ యేట‌ ధూమపానం అల‌వాట‌య్యింది. అయితే.. 67 సంవత్సరాల వయస్సులో అతనికి ఛాతీ నొప్పి రావడంతో పొగ‌త్రాగ‌డం బంద్ చేశాడు. ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని గ్ర‌హించి, ఈ అల‌వాటు మెల్లగా మానుకోవాలనుకున్నాడు. దీంతో సిగ‌రెట్ వ్య‌స‌నానికి స్వ‌స్తి చెప్పేశాడు. గ‌డిచిన‌ ఎనిమిదేళ్లుగా సిగరెట్ జోలికే వెళ్లడం మానేశాడు.

అయితే.. వేణుగోపాల్ నాయర్ రోజూ సిగరేట్ల‌కు ఖర్చు పెట్టే సొమ్మంతా జమ చేశాడు. అవి రూ. 5 లక్షలు వ‌ర‌కూ అయ్యాయి. ఈ మొత్తంతో నాయ‌ర్‌ తన ఇంటిపై మ‌రో అంతస్తు నిర్మిస్తున్నాడు. అంత‌కు ముందు నాయ‌ర్ రోజుకు ఒకటిన్నర ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడు. అప్పుడు సిగరెట్‌ ప్యాకెట్ ధ‌ర రూ. 50 రూపాయలు. ఇలా ఎనిమిది ఏళ్ల‌పాటు సిగ‌రెట్లు మానేసి.. రూ. 5 లక్షలు ఆదా చేసి.. ఆ సొమ్ముతో ఇప్పుడు ఇల్లు క‌ట్టిస్తున్నాడు.

ఇక‌ పొగ‌త్రాగ‌రాదు.. దూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అంటూ ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు, అవగాహన కార్య‌క్ర‌మాలు చేపట్టినా ఆ అల‌వాటు బారిన‌ పడేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వేణుగోపాల్ నాయర్ వాంటి వాళ్ల క‌థ‌లు చ‌దివిన త‌ర్వాతైనా కొద్దిమందిలో మార్పు వ‌స్తే అదే ప‌దివేలు.

Next Story