భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2020 5:55 PM IST
భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..!

క‌రోనా మ‌హ‌మ్మారి ముప్పుతో ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రేమికుల అంద‌రి చూపు టీ20 వ‌రల్డ్‌క‌ప్‌పై ప‌డింది. ఆస్ట్రేలియా వేదిక‌గా.. అక్డోబ‌ర్ లో ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. అయితే.. క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఆరు నెల‌ల పాటు విదేశీయుల‌కు అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో టీ20 ప్ర‌పంచ కప్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇదిలా ఉంటే.. భార‌త మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ ఓ స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌తో ముందుకు వ‌చ్చాడు. ఈ ఏడాది భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను నిర్వ‌హించి, వ‌చ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వ‌హించాల‌ని గ‌వాస్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఐసీసీ షెడ్యూల్ ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ఆస్ట్రేలియా వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా.. వ‌చ్చే ఏడాది భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించాలి.

"సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియాలో విదేశీయులకు అనుమతి లేదు. అక్డోబ‌ర్ నెల మధ్యలో పొట్టి వరల్డ్‌కప్‌ ఆరంభం కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇరు దేశాలూ ఆతిథ్య బాధ్యతలను పరస్పరం మార్చుకోవాలి. ఈ ఏడాది భారత్‌, వచ్చే ఏడాది ఆసీస్‌ నిర్వహించేలా ఒప్పందం చేసుకోవాలి. అయితే.. ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఐపీఎల్ ను నిర్వ‌హించాలి. దీని వ‌ల్ల ఆట‌గాళ్ల‌కు ప్రాక్టీస్ చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. న‌వంబ‌ర్‌లో ప్ర‌పంచ‌క‌ప్‌, డిసెంబ‌ర్‌లో దుబాయ్ వేదిక‌గా ఆసియాక‌ప్ నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని". గ‌వాస్క‌ర్ అన్నారు.

Next Story