విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన.. ఇద్దరు మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Jun 2020 9:31 AM ISTవిశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం పరిధి పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కార్మికులను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు. రియాక్టర్ వద్ద హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో లీకడవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి మట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఇదిలావుంటే.. ఎటువంటి భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పక్కనే ఉన్న తానం గ్రామ ప్రజలు ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.