పార్టీలో చేరకుండానే మంటలు మండిస్తున్నాడే.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Sept 2020 6:56 PM ISTవల్లభనేని వంశీ.. పరిచయటం అవసరం లేని పేరిది. ఎంఎల్ఏల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజి ఉన్న వ్యక్తి. వరుసగా రెండోసారి కూడా తెలుగుదేశంపార్టీ తరపున ఎంఎల్ఏగా గెలిచాడు. రాష్ట్రంలో ఉధృతమైన వైసిపి గాలిని తట్టుకుని టిడిపి తరపున గెలిచిన 23 మందిలో చాలా కీలకమైన ఎంఎల్ఏ. కీలకమైన ఎంఎల్ఏ అని ఎందుకు చెప్పాలంటే రాజధాని అమరావతికి సమీపంలోనే ఉన్న గన్నవరం నియోజకవర్గం నుండి గెలిచాడు.
టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రబాబునాయుడు మీద తిరుగుబాటు లేవదీశాడు. చంద్రబాబు, చినబాబు మీద తిరుగుబాటు కారణంగా పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. మరి పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎంఎల్ఏ దారెటుంటుంది ? సహజంగానే అధికారపార్టీలోకే అని ఠక్కున చెప్పొచ్చు. కానీ వివిధ కారణాల వల్ల అధికారికంగా వంశీ ఇంకా వైసిపిలో చేరలేదు. కానీ అంశాల వారీగా సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతు ఇస్తూనే ఉన్నాడు. అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా ఓ సీటు కేటాయింప చేసుకున్నాడు.
సరే ఇపుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. వంశీ వైసిపిలో చేరుతాడనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైసిపిలో చేరకుండానే అధికార పార్టీ ఎంఎల్ఏగా చెలామణి అయిపోతున్నాడు. మొన్నటికి మొన్న మంత్రి కొడాలి నాని, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ తో మీడియా సమావేశంలో కూర్చోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు తన మద్దతుదారులతో మాట్లాడుతూ తాను వైసిపి ఎంఎల్ఏనే అని ప్రకటించేశాడు. ఇంకేముంది నియోజకవర్గంలో మంటలు మొదలైపోయాయి. ఎందుకంటే వంశీ రాకను మొదటి నుండి యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నాడు. యార్లగడ్డతో పాటు మరో నేత దుట్టా రామచంద్రరావు కూడా వల్లభనేనికి వ్యతిరేకమే. వంశీ పార్టీలోకి వస్తాడనే ప్రచారం మొదలైనపుడు మొదట వ్యతిరేకించింది యార్లగడ్డే. కాకపోతే తర్వాత ఆప్కాబ్ ఛైర్మన్ పదవి దక్కటంతో సైలెంట్ అయిపోయాడు.
ఎప్పుడైతే యార్లగడ్డ సైలెంట్ అయిపోయాడో అప్పటి నుండో వంశీకి వ్యతిరేకంగా దుట్టా రాజకీయం మొదలుపెట్టాడు. నియోజకవర్గమంతా దుట్టా తిరిగేస్తు వంశీకి వ్యతిరేకంగా పెద్ద బ్రిగేడ్ నే తయారు చేసుకుంటున్నాడు. నియోజకవర్గంలో దుట్టా ఎక్కడ పర్యటించినా వంశీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడని టాక్.
ఎలాగూ తాను చేయలేని పనిని మిత్రుడు చేస్తున్నాడు కాబట్టి యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా దుట్టాతో చేతులు కలిపాడని సమాచారం. విడివిడిగా చూస్తే ఎంఎల్ఏ-యార్లగడ్డ-దుట్టా ముగ్గురు గట్టి నేతలే. అయితే వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ+దుట్టాలు చేతులు కలిపారంటే పార్టీలో వాళ్ళదే పైచేయిగా మారటం ఖాయం. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వంశీ-వైరి వర్గాల రాజకీయంపైనే చర్చ జరుగుతోంది. మరిద్దరినీ ఏకకాలంలో ఎంఎల్ఏ ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఆసక్తిగా మారింది. మొత్తం మీద వంశీ ఇంకా అధికారికంగా పార్టీలో చేరకుండానే పార్టీలో మంటలు మండిస్తున్నాడు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత మంటలు చల్లారిపోతాయా ? లేకపోతే మరింతగా చెలరేగుతాయా అన్నదే చూడాలి.