నాలుగు రాష్ట్రాల వారికి 'నో ఎంట్రీ' బోర్డు పెట్టేసిన కర్ణాటక

By సుభాష్  Published on  18 May 2020 9:54 AM GMT
నాలుగు రాష్ట్రాల వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిన కర్ణాటక

లాక్ డౌన్ 4.0 ను భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. పలు రాష్ట్రాలు మరింత అలర్ట్ అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తమ రాష్ట్రం లోకి నాలుగు రాష్ట్రాల ప్రజలను రానివ్వమని తేల్చి చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వారిని మే 31 వరకూ అనుమతించమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి ఉంటే ఇతర రాష్ట్రాల లోకి పౌరులు వెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపిన తర్వాతి రోజే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కోవిద్-19 కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలో ఒక్క రోజులోనే 84 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం కర్ణాటకలో తొలిసారి. ప్రస్తుతానికి 1231 కేసులు నమోదయ్యాయి.

మే 31వరకూ లాక్ డౌన్ ఉంటుందని పలు సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మినిస్టర్లతోనూ, పలువురు సీనియర్ ఆఫీసర్లతోనూ భేటీని నిర్వహించారు. రెడ్ జోన్స్ మినహా కర్ణాటకలో బస్సులను నడుపుకోడానికి అనుమతి ఇస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. సోషల్ డిస్టెంసింగ్ ను పాటిస్తూ.. బస్సుల్లో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు.

ఓలా, ఉబర్ లు రేపటి నుండి తమ సర్వీస్ లు నడుపుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి 14 రోజుల పాటూ క్వారెంటైన్ తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.

ఆదివారాలు కర్ణాటక రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందని డిప్యూటీ ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ తెలిపారు. కేవలం ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. పార్కులు కూడా రేపటి నుండి తెరుస్తామని అశ్వత్ నారాయణ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన అన్ని సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని అన్నారు. కంటైన్మెంట్ జోన్స్ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో అన్ని షాపులను తెరచుకోవచ్చని ఆయన అన్నారు. మాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సినిమా హాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసే ఉంచనున్నామన్నారు.

Next Story