రాష్ట్రాలకే జోన్ల నిర్ణయం

By సుభాష్  Published on  18 May 2020 3:09 AM GMT
రాష్ట్రాలకే జోన్ల నిర్ణయం

దేశంలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే జోన్ల విషయంలో తీసుకునే నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపుల నిర్ణయం రాష్టాలకే వదిలేసిన కేంద్రం.. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 31వ తేదీ వరకూ మెట్రో, విమనా సర్వీసులు బంద్‌ ఉండనున్నాయి.

అలాగే మే 31 వరకూ కాలేజీలు, స్కూళ్లకు ఎలాంటి అనుమతి లేదు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌పై, అలాగే దేవాలయాలు కూడా మూసివేయాలని ఆదేశించింది.

అయితే కరోనా వ్యాప్తిని బట్టి ఏ ప్రాంతంలో ఎలాంటి జోన్లు ఏర్పాటు చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలే నిర్ణయించాలని కేంద్రం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగానే వీటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు ఎవ్వరు రోడ్లమీదకు వచ్చేందుకు కూడా అనుమతి లేదని తెలిపింది. ప్రతి ఇంటిపై నిఘా ఉంచాలని, అనుమానితులకు అవసరమైన కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

అలాగే ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కంటైన్‌ మెంట్ జోన్లు, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లను ఏర్పాటు చేసింది. రెడ్‌ జోన్లలో ప్రజలనెవ్వరిని బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వారికి కావాల్సిన నిత్యవసర వస్తువులను సైతం ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. ఇక గ్రీన్‌ జోన్‌లో లాక్‌డౌన్‌ నుంచి కొంత సడలింపులు ఇచ్చారు.

ఆరెంజ్‌ జోన్లలో కూడా ఎక్కువగానే సడలింపు కొనసాగుతున్నాయి. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఈ ప్రాంతాల్లో జోన్లను ఎత్తివేయాలా..? వద్దా..? అనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నిర్ణయం కూడా రాష్టాలకే వదిలేస్తున్నట్లు పేర్కొంది.

Next Story