కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో లాలూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 8:45 AM GMT
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో లాలూ..

కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ కీలక నేత రుఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోయింది.

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన‌ రఘువంశ్‌ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌లో మాజీ ముఖ్యమంత్రి, సామ్యవాది కర్పూరీ ఠాకూర్ మరణించిన తర్వాత 32 ఏళ్ళపాటు మీతో కలిసి నడిచాను.. ఇకపై నడవను అని లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

రఘువంశ్ లేఖ‌పై లాలూ స్పందిస్తూ.. తాను దీనిని నమ్మలేకపోతున్నానని చెప్పారు. ముందుగా కోలుకోవాలని, తర్వాత మనమిద్దరం కలిసి మాట్లాడుకుందామని రఘువంశ్‌కు సలహా ఇచ్చారు. మీరు ఎక్కడికీ వెళ్ళడం లేదని తెలుసుకోండని పేర్కొన్నారు.



అయితే.. ఆదివారం ఉదయం రఘువంశ్ మరణవార్త‌ తెలుసుకున్న లాలూ తీవ్ర విచారంతో ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన రఘువంశ్ బాబు.. ఏం చేశావు నువ్వు? నువ్వు ఎక్కడికీ వెళ్ళడం లేదని.. మొన్ననే నీకు చెప్పాను. కానీ నీవు చాలా దూరం వెళ్ళిపోయావు. నేను నిన్ను ఎంతో కోల్పోతున్నాన‌ని విచారం వ్య‌క్తం చేశారు.

ఇదిలావుంటే.. రఘువంశ్ ప్రసాద్ సింగ్‌ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. రఘువంశ్ ప్రసాద్ మరణంతో దేశ రాజకీయాల్లో పెద్ద లోటు ఏర్పడిందని మోదీ అన్నారు.

Next Story