స్వామి అగ్నివేశ్ మీద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వర్ రావు అనుచిత వ్యాఖ్యలు..!  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 3:17 AM GMT
స్వామి అగ్నివేశ్ మీద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వర్ రావు అనుచిత వ్యాఖ్యలు..!  

ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించారు. భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధి తో బాధపడుతూ ఉన్న ఆయన.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ లో తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణానికి పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు. కానీ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎం. నాగేశ్వరావు పేరు మీద ఉన్న ట్విట్టర్ ఖాతాలో.. స్వామి అగ్నివేశ్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్‌‌ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.ఆ ట్వీట్ బాగా వైరల్ అయింది. చాలా మంది ఆయన అకౌంట్ ను ఎవరైనా హ్యాక్ చేశారని భావించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఇండియన్ పోలీసు ఫౌండేషన్ తప్పుబట్టింది. బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్ అయుండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆరోపించారు. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్‌ చేసింది ఇండియన్ పోలీసు ఫౌండేషన్.రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్, ఇన్వెస్టిగేటర్ సాకేత్ గోఖలే నాగేశ్వర్ రావు మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-మినిస్ట్రీకి ఫిర్యాదు చేశాడు. నాగేశ్వర్ రావు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఐపీఎస్ ను ఉపయోగిస్తూ ఉన్నాడని సాకేత్ గోఖలే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 170 కింద ఇది నేరమని.. రెండేళ్ల పాటూ శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు సాకేత్ గోఖలే.

పలు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఆఫీసర్లు నాగేశ్వర్ రావు వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణలు చెప్పాలని సూచించారు.

అది అధికారిక ఖాతానా లేక ఇతరులెవరైనా ట్వీట్ చేశారా అని నాగేశ్వర్ రావును న్యూస్ మీటర్ సంప్రదించగా.. అవి తన వ్యాఖ్యలేనని.. నేను ఏమి అనుకున్నానో అవే తన ట్వీట్ లో చెప్పానని ధృవీకరించారు. జులై నెల నుండి తన ట్విట్టర్ ఖాతాను తానే వాడుతున్నానని తెలిపారు. రాజకీయ కోణంలో ఈ వ్యాఖ్యలను చేశారా అని అడగగా.. తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని.. రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్నానని అన్నారు.

Next Story
Share it