Fact Check : బస్సులో సీట్లు మునిగిపోయేంతలా వర్షపునీరు.. ఎక్కడ చోటుచేసుకుంది..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2020 6:13 PM ISTదేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షం పడుతోంది. ఆగష్టు 13న ఢిల్లీ లోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు వరదనీటి ఉధృతిలా తలపించింది. అక్కడి పరిస్థితిని చూపించేలా ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి.
ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. బస్సు ప్రయాణిస్తూ ఉండగా.. వర్షపు నీటిలో నుండి బస్సు వెళ్లడం.. క్షణాల్లో నీళ్లు సీట్ల ఎత్తు వరకూ రావడాన్ని గమనించవచ్చు. కొందరు ట్విట్టర్ యూజర్లు ఈ వీడియో ఢిల్లీకి సంబంధించిందని చెబుతూ వస్తున్నారు.
కేజ్రీవాల్ గారు ఢిల్లీ వాళ్లకు వెనిస్ టూర్ ను ప్రభుత్వ బస్సుల్లోనే చూపిస్తున్నారు కదూ అంటూ పోస్టులు పెట్టారు.
ఢిల్లీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ దత్ కూడా ఈ వీడియో గురించి ట్వీట్ చేశారు. పకోడాలు వర్షం నీటిలో వేసుకోవడం ఎలాగో కేజ్రీవాల్ చెబుతారు అంటూ కౌంటర్ వేశారు.
నిజ నిర్ధారణ:
ఈ ఘటన ఢిల్లీ జరిగినట్లుగా చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
ఈ వీడియోను బాగా పరిశీలించగా.. కిటికీల్లో సైన్ బోర్డులు గమనించవచ్చు. ఆ సైన్ బోర్డుల్లో 'SMS ఆసుపత్రి' అన్న అక్షరాలను గమనించవచ్చు. ఈ కీవర్డ్ ను ఉపయోగించి చూడగా SMS ఆసుపత్రి అంటే 'స్వామి మాన్ సింగ్ హాస్పిటల్' అని తెలుస్తుంది. ఈ ఆసుపత్రి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉంది.
వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను ట్రిమ్ చేశారని అర్థం అవుతుంది. ఈ వీడియో సంబంధించిన అంతకంటే నిడివి ఉన్న వీడియోను యుట్యూబ్ లో చూడొచ్చు. “Water enters the low-floor bus during heavy rain in Jaipur” అంటూ జైపూర్ లో చోటుచేసుకున్న ఘటనగా వీడియోను అప్లోడ్ చేశారు.
ఆ పూర్తీ వీడియోలో ‘Nasiyan Bhattarak Ji’ అన్న సైన్ బోర్డును గమనించవచ్చు. ఆ ప్రదేశం జైపూర్ లో ఉన్న జైన్ టెంపుల్. 0.59 సెకెండ్ల వద్ద 'జైపూర్ బస్సు' అంటూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది ఢిల్లీలో కాదు అని అర్థం అవుతుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకోలేదు.. రాజస్థాన్ లో చోటుచేసుకుంది అంటూ ట్విట్టర్ లో తెలిపింది.
ఆల్ట్ న్యూస్ వార్తా సంస్థ కూడా ఈ వీడియో ఢిల్లీలో చోటుచేసుకోలేదని.. జైపూర్ లో జరిగిందని తెలిపింది.
ఢిల్లీలో ప్రభుత్వానికి చెందిన బస్సులోకి నీళ్లు వచ్చి చేరాయంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.