తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఇంకా  చాలా ప్రాంతాల్లో నీరు అలాగే ఉంది. వర్షం నిలిచిపోయినా కూడా ఎన్నో కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని తక్షణమే సహాయ శిబిరాలకు తరలించి, వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. నిరాశ్రయులకు రేషన్‌ కిట్లను అందజేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని, అధైర్యపడకూడదని ప్రభుత్వం చెబుతోంది. వరదనీటి కారణంగా బయటికి రాలేకపోతున్న ప్రజలకు రేషన్‌కిట్‌తోపాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నిస్తోంది.

ఇలాంటి సమయాల్లో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇళ్లల్లోకి చేపలు వచ్చినట్లుగా ఆ వీడియోలో ఉంది. వాటిని ప్రజలు పట్టుకుంటూ ఉన్నారు. ఫేస్ బుక్, వాట్సప్ లలో ఈ వీడియో వైరల్ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో చేపల పెంపకం అంటూ వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

హైదరాబాద్ వరదల్లో చేపలు కూడా ఇళ్లల్లోకి వచ్చినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ‘ఎటువంటి నిజం లేదు’

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఆ వీడియోలు వరంగల్ కు చెందినవని స్పష్టమవుతోంది. 2020 సంవత్సరం ఆగష్టు నెలలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియో అది.

వరంగల్ లో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయని.. ఏకంగా ఇళ్లలోకి చేపలు వచ్చేశాయని చెబుతూ స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. యూట్యూబ్ లో కూడా వీడియోలను పోస్టు చేశారు.

ఆగస్టు 2020 లో భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో కూడా వరదలు వచ్చాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి.  India Today, Times of India లోనే కాకుండా స్థానిక మీడియాలో కూడా వరదలకు సంబంధించిన కథనాలు వచ్చాయి.

వరదల్లో చేపలు కూడా ఇళ్లల్లోకి వచ్చినట్లుగా వైరల్ అవుతున్న పోస్టులు హైదరాబాద్ కు చెందినవి కాదు. ఆగష్టు నెలలో వరంగల్ లో వచ్చిన వరదలకు సంబంధించిన వీడియో. ఈ వైరల్ అవుతున్న వీడియో ‘అబద్ధం’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *