ముఖ్యాంశాలు

  • ఆర్టీసీ సమ్మెపై ఫైనల్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ ఎండీ
  • సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44 శాతం ఆర్టీసీ నష్టపోయింది: ఆర్టీసీ ఎండీ
  • 43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

హైదరాబాద్‌: హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ఫైనల్‌ అఫిడవిట్‌ను ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని.. ఆర్టీసీ కార్పొరేషన్‌ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ ఎండీ అఫిడవిట్‌లో తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44 శాతం ఆర్టీసీ నష్టపోయిందన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తెలిపారు. యూనియన్‌ నేతలు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని.. మళ్లీ విలీనం డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని అఫిడవిట్‌లో తెలిపారు.

యూనియన్‌ నేతలు సొంత ఉనికి కోసమే సమ్మె చేస్తున్నారని.. అలాంటి సమ్మెను ఇల్లీగల్‌ అని ప్రకటించాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించేందుకు జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్‌లో తెలిపారు.

మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె సకలజనుల సమ్మె రికార్డును బ్రేక్‌ చేసింది. భవిష్యత్తు కార్యచరణ నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలు సామూహిక నిరసన దీక్షను చేపట్టారు. దీక్ష నేపథ్యంలో వీఎస్టీలోని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Rtc3

దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన ఇంట్లోనే నిరవధిక నిరసన దీక్షకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను ఉధృతం చేసి సడక్‌ బంద్‌, రైల్వే రోకో చేస్తోమని అశ్వత్థామరెడ్డి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రయాణికుల ఇబ్బందులు..

ఇదిలా ఉంటే బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ యాజమానులు దొరికినంత దోచుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని సగటు ప్రయాణికుడు కోరుకుంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఆయ‌న వెంకన్న స్వామిని.. ‘వెంకన్న చౌదరి’ చేశారు.!

రచయిత అభిప్రాయం
43 రోజుల సమ్మె
27 మంది కార్మికుల బలిదానాలు
48 వేల మంది ఆర్తనాదాలు
కేవలం ఒక్క వ్యక్తి (ముఖ్యమంత్రి) ముందు తలొంచింది

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.