కృష్ణా జిల్లాలో విషాదం.. కుమారై సమాధి వద్దే తుదిశ్వాస విడిచిన తండ్రి
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2020 11:14 AM GMTఆ తండ్రికి ఇద్దరు కూతుర్లు. వారిద్దరిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. బిడ్డలంటే అతడికి వల్లమాలిన ప్రేమ. అయితే.. ఇటీవల అతడి పెద్ద కుమారై మరణించింది. కన్నబిడ్డ దూరం అవడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. చివరికి కుమారై సమాధి వద్దే ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం కుమ్మరిగూడెం ప్రాంతానికి చెందిన గిరిబాబు(52) గోల్డ్ కవరింగ్ పని చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పిల్లలు అంటే అతడికి ఎంతో ప్రేమ. కొంతకాలం క్రితం పెద్ద కుమారై రేణుకా దేవికి వివాహం చేశాడు. ప్రవస సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై రేణుకా దేవి మరణించింది. కుమారై మరణంతో గిరిబాబు కుంగిపోయాడు. ప్రతి రోజు ఆమెను తలుచుకుంటూ బాధపడేవాడు. పదేపదే కూమారై సమాధి వద్ద వెళ్లి వస్తుండేవాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.
దీంతో అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. గాలించే క్రమంలో శ్మశానం వద్దకు వెళ్లి చూడగా.. కుమారై సమాధి వద్ద గిరిబాబు విగతజీవిగా కనిపించాడు. పెద్ద కూతురు దూరం కావడంతో.. గిరిబాబు అప్పటి నుంచి మానసికంగా వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. పోలీసులు మృతదేహాన్ని బంధరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.