ఏపీలో ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై కొరఢా.. ఐదు ఆస్పత్రుల అనుమతులు రద్దు..!

By సుభాష్  Published on  26 Aug 2020 6:07 AM GMT
ఏపీలో ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై కొరఢా.. ఐదు ఆస్పత్రుల అనుమతులు రద్దు..!

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ఘటన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులపై ఏపీ సర్కార్‌ కొరఢా ఝులిపిస్తోంది. అనుమతులు, సౌకర్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని విజయవాడతో పాటు పలు చోట్ల ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఆగడాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది. విజయవాడలో ఐదు ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తూ, బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబితాలో ఈ ఐదు ఆస్పత్రులున్నాయి.

రమేష్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ హైట్స్‌, డాక్టర్‌ లక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ వారి ఎనికేపాడులోని అక్షయ్‌, బ్రిటిష్‌ ఆస్పత్రివారు నిర్వహిస్తున్న బెంజిసర్కిల్‌లోని ఐరా, ఎన్నారై హీలింగ్‌ హ్యాండ్స్‌, ఆంధ్రా ఆస్పత్రి వారి సన్‌సిటీ, కృష్ణ మార్గ్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు అనుమతులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రమేష్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పది మంది వరకు మృత్యువాత పడగా, మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అలాగే అనంతపూర్‌లోని సర్వజన ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇలా నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న కోవిడ్‌ సెంటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

Next Story