ముఖ్యాంశాలు

  • టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ వాహనాలకు ప్రత్యేక వరుసలు
  • రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఫాస్టాగ్‌ విధానం

ఢిల్లీ: నేటి అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్‌ హైవేలపై టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. నేషనల్‌ హైవేలపై టోల్‌ట్యాక్స్‌ల చెల్లింపులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రత్యేక ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై టోల్‌ప్లాజా దాటి వెళ్లాలంటే ఖచ్చితంగా ఫాస్టాగ్‌ ఉండాల్సిందే. టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ఉండే వాహనాలకు ప్రత్యేక వరుసలుంటాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాలకు ఒకే వరుస ఉంటుంది. ఫాస్టాగ్‌ లేని లైన్‌లో భారీగా వాహనాలు ఉంటాయి. అయితే ఫాస్టాగ్‌ ఉండే వరుసలో వెళ్తే మాత్రం టోల్‌ సిబ్బంది అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.

విజయవాడ-హైదరాబాద్‌ నేషనల్‌ హైవేలోని పతంగి టోల్‌ప్లాజాను శనివారం సాయంత్రం ఎన్‌హెచ్‌ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ పరిశీలించారు. కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్‌ విధానాన్ని డిసెంబర్‌ 1 నుంచే అమలు చేయాలని మొదట భావించింది.. కానీ చాలా వాహనదారులు ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయకపోవడంతో ఆదివారం వరకు పొడిగించింది. ఈ మేరకు డిసెంబర్‌ 15 అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్‌ విధానం అమలులోకి వచ్చిందని కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటి వరకు 40 శాతం వాహనదారులు మాత్రమే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేశారని.. ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్‌ అమలులోకి రావడంతో ప్రతిఒక్క వాహనదారుడు ఫాస్టాగ్‌లను కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఫాస్టాగ్‌ పని చేస్తుంది. ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను వాహనం ముందు భాగంలోని అద్దంపై అతికిస్తారు. టోల్‌ప్లాజా వద్దకు వెళ్లినప్పుడు ఫాస్టాగ్‌ను ఆర్‌ఎఫ్‌ఐడీ ఆటోమెటిగ్గా స్కాన్‌ చేసుకుంటుంది. కోడ్‌ స్కాన్‌ కావడంతో ఫాస్టాగ్‌ వాలెట్‌లోని మొత్తం నుంచి టోల్‌ఛార్జీ కట్‌ అవుతుంది. ఆ తర్వాత గేట్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి 5-20 సెకన్లు పడుతుంది. ఆ తర్వాత వాహనదారుడికి మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.

టోల్‌ప్లాజాల వద్ద 25 వరుసలను హైబ్రీడ్‌ లైన్లుగా మారుస్తూ శనివారం నాడు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఫాస్టాగ్‌ లేని వాహనదారులు ఫాస్టాగ్‌లైన్‌లోకి వెళ్లిన సాధారణ టోల్‌ఫీజును వసూలు చేస్తారు. ఈ విధానం నెల రోజుల పాటు అమల్లో ఉండనుంది. ఒకవేళ అప్పటికప్పుడు ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి టోల్‌ప్లాజా వద్దనే ఫాస్టాగ్‌లను విక్రయిస్తున్నారు. ఫాస్టాగ్‌లను పలు ప్రైవేట్‌ కంపెనీలు, 23 బ్యాంక్‌లు విక్రయిస్తున్నాయి. పేమెంట్‌ యాప్‌లు, వ్యాలెట్‌ యాప్‌లు, అమెజాన్‌, ఈ కామర్స్‌ సంస్థల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొదట వాహనదారులు రూ.200 వన్‌టైం జాయినింగ్‌ ఫీజును, కేవైసీ పత్రాలను చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత పోస్టులో ఫాస్టాగ్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్‌ దరఖాస్తు చేసుకున్న వాహనదారుడి ఇంటికి వస్తుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.