జనవరి 1నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2020 11:24 AM GMTటోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్టాగ్ తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్టాగ్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు 1980 మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ..శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2021 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ చెయ్యాలంటే ఫాస్ట్టాగ్ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పొందుపరిచారు. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఫాస్టాగ్ ఉండాలన్న నిబంధనను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.