మృతదేహం లేకుండా అంత్యక్రియలు.. కారణం ఏమిటంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2020 3:33 AM GMTకరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతదేహం లేకుండానే అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. వివరాళ్లోకెళితే.. ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా హరీపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వలసకార్మికుడిగా పనిచేస్తున్నాడు.
లాక్‌డౌన్‌లో చిక్కుకొని ఆ వ్యక్తి ఎట్టకేలకు తన స్వగ్రామం హరీపూర్ చేరుకున్నాడు. అయితే.. ఆ వ్యక్తి ఆస్తమాతో బాధపడుతుండటంతో.. అతని కుటుంబసభ్యులు ఈ నెల 12న భంజానగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి బెర్హంపూర్ నగరంలోని ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు పంపించారు.
అయితే.. ఎంకేసీజీ మెడికల్ కళాశాల వైద్యులు ఆ వ్యక్తిని అక్కడి నుండి సీతాలపల్లిలోని కొవిడ్ ఆసుపత్రికి పంపారు. అక్కడ కరోనా లక్షణాలతో ఆ వ్యక్తి మరణించడంతో అతని మృతదేహానికి వైద్యులు పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో మరణించిన వ్యక్తికి కరోనా లేదని తేలింది. అయినా అధికారులు.. పొరపాటున ఆ వ్యక్తి కరోనా వైరస్ కారణంగానే మరణించాడని ప్రకటించారు.
ఆ వలస కార్మికుడు కరోనాతో మరణించలేదని.. అధికారులు తప్పుగా ప్రకటించారని తెలిసినా హరీపూర్ గ్రామస్థులు అతని మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు జరిపేందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు సీతాలపల్లిలో మృతదేహానికి అంత్యక్రియలు జరిపి.. అనంతరం ఇసుకతో ఓ మృతదేహం బొమ్మను తయారు చేసి దానికి హరీపూర్ గ్రామంలో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియల్లో మృతుడి కుటుంబసభ్యులు, సమీప బంధువులు పాల్గొని నివాళులు అర్పించారు. కరోనా కారణంగా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులే జరుగుతున్నా.. అధికారులు మాత్రం బాద్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు.