నకిలీ ఐఏఎస్‌ గుట్టు రట్టు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 4:00 PM IST
నకిలీ ఐఏఎస్‌ గుట్టు రట్టు..

రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ డాక్టర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న ఓ మహిళను హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరా మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి.. తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని రూ.3500 వసూలు చేస్తోంది.

ఇదే విధంగా ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్‌లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోంకు వెళ్లి పూజ నిమిత్తం రూ.3500 ఇవ్వాలని కోరింది. కాగా.. ఆ ఆస్పత్రి వైసీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు డా: దుట్టా రామ చంద్రరావుది. సిబ్బందికి అనుమానం వచ్చి అతడి కుమారుడు రవి శంకర్‌ కు సమాచారం ఇచ్చారు. అతను ఐఏఎస్‌ అధికారిణి సుజాత రావుకు ఫోన్‌ చేశాడు. ఆమె తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని చెప్పింది. వెంటనే శంకర్‌ ఆస్పత్రికి చేరుకోగా.. అప్పటికే అక్కడకు ఐఏఎస్‌ అంటూ వచ్చిన మహిళ పరారైంది. రవిశంకర్‌ ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ ఐఏఎస్‌ కోసం గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం విజయలక్ష్మీని అరెస్టు చేశారు. గతంలో ఈమె నందిగామ, హైదరాబాద్‌, విజయవాడ, గన్నవరం ఏరియాల్లో ఇలాగే వసూళ్లకు పాల్పడినట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంటల వ్యవధిలోనే నింది నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సిఐ రమణ, ఎస్ఐ మదీనా భాష మరియు ఇతర సిబ్బందిని డిఎస్పి అభినందించారు.

Next Story