ఏపీలో తెలంగాణ పోలీస్ వాహనం తనిఖీ.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..!
By సుభాష్ Published on 26 Jun 2020 11:26 AM ISTప్రస్తుతం ఉన్న సాంకేతికను మంచితనానికి ఉపయోగించుకోకుండా మోసాలకు ఉపయోగించుకునే వారు ఎక్కువై పోతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో మోసాలకు అంతే లేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తాజాగా విజయవాడలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి చేసిన మోసం బట్టబయలైంది. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అందరిలాగే ఓ పోలీస్ బోర్డు ఉన్న ఓ వాహనం వచ్చింది. ఆ కారును సైతం ఏపీ పోలీసులు తనిఖీ చేయాలని అడుగగా, నేను కూడా మీలాగే పోలీస్‌ను.. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తాను.. అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఐడీ కార్డు చూపించాలని పోలీసులు కోరగా, అంది కూడా చూపించాడు ఆ మహానుభావుడు. కానీ ఐడీ కార్డులో తేడా ఉన్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక కారు వివరాలను పోలీసులు తనిఖీ చేయగా, అసలు విషయం బట్టబయలైంది. ఏపీ కారును తెలంగాణ రిజిస్ట్రేషన్ కింద మార్చేసి వాడుతున్నాడు. ఇక అతడు చూపించిన ఐడీకార్డు కూడా నకిలీదేనని పోలీసులు గుర్తించారు. అతను అసలు పోలీసు కాదు.. ఓ దొంగ. (ఇది చదవండి: ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్)
నకిలీ పోలీస్‌గా చెప్పుకునే ఆ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంకు చెందిన గుత్తుల ప్రశాంత్ (30)గా గుర్తించారు పోలీసులు. అతను హైదరాబాద్‌లో స్థిరపడి, సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. సదరు యూట్యూబ్ ఛానల్‌కు కరస్పాండెంట్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరచూ ఏపీకి రాకపోకలు కొనసాగిస్తున్న ప్రశాంత్.. ఇలా ఫేక్ ఐడీ కార్డులు, నకిలీ పోలీసు అంటూ అవతారమెత్తాడు. తన కారును తెలంగాణ పేరు మీద మార్చేసి నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. కాగా, తాను పోలీసునంటూ నకిలీ ఐడీ కార్డును చూపించి పోలీసుల తనిఖీల్లో, టోల్‌గేట్ల నుంచి తప్పించుకుంటున్నాడు. ఇలాంటి మోసాలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు అడిగితే.. తాను పోలీస్ తనిఖీల నుంచి, టోల్‌గేట్ల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నానని, అంతకు మించి ఇంకేమి చేయడం లేదని చెప్పుకొచ్చాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. అడ్డుదారులు తొక్కి ఇలా అడ్డంగా బుక్కై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. (ఇది చదవండి: 10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..)